ఆడబిడ్డే అదృష్టం.. ఎందుకో తెలుసా?

భార్యలా, తల్లిలా, చెల్లిలా, స్నేహితురాలిగా ఆడపిల్ల లేని జీవితం మనకు వ్యర్థం. ఆకాశంలో సగం.. అన్ని రంగాల్లోనూ సగంగా సత్తా చాటుతున్న ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఉంది. ఆడపిల్ల పుడితే అరిష్టం అనే రోజులు ఉండేవి. ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చిదిమేసే వారు ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు. ఆడపిల్ల నట్టింట్లో ఉంటే మహాలక్ష్మీలా కొలిచేవారు కూడా మన సమాజంలో ఉన్నారు.. ఆడబిడ్డ పుట్టాకే కోటీశ్వరులు అయినవారు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. ఇప్పటికే బిడ్డ పుట్టకే తమకు కలిసి వచ్చిందని చాలా మంది చెబుతుంటారు. ఆడబిడ్డల గజ్జల చప్పుడుతో ఇంటి లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందనే నానుడి కూడా ఉంది. ఈ రోజు ‘‘అంతర్జాతీయ బాలిక దినోత్సవం’’ సందర్భంగా ప్రత్యేక కథనం..

బాలికల హక్కులను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ బాలికా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల క్రితం వరకూ వంటింటికే పరిమితం అయిన ఆడపిల్ల నేడు ఆధునిక సమాజంలో పురుషుడితో సరిసమానంగా అన్నింట్లోనూ పోటీపడుతోంది. కానీ ఇప్పటికీ అభద్రతల మధ్య అత్యాచారాలు, అంగట్లో పశువుగా కూడా మారిపోతోంది.

2011 డిసెంబర్ 19న ఐక్యరాజ్యసమితి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానం చేసింది. తొలి ఏడాది బాల్య వివాహాలను అరికట్టాలని సూచించింది. 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుతున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి లింగవివక్షను అరికట్టడానికి.. మహిళా సాధికారిత కోసం ఈ బాలికల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తోంది.

ఇక ఈ సంవత్సరం కూడా బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఆడపిల్లలు దేనిలోనూ సాటిలేరు అనే నినాదం ఇచ్చారు. బాలిక దినోత్సవం సందర్భంగానైనా ఆడపిల్లలపై వివక్షను మనమందరూ రూపుమాపుదాం. ఆడమగ వ్యత్యాసాలను తగ్గించి మన ఆడబిడ్డలను అక్కున చేర్చుకుందామనే పిలుపునిద్దాం.. ఆడబిడ్డ నవ్వే మన ఇంటి వెలుగుగా చాటిచెబుదాం..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*