బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ,కార్యదర్శిగా అమిత్ షా తనయుడు?

ముంబయి: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) తదుపరి అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పదవికి పోటీలో ఉన్న వారిలో మిగతావారికన్నా గంగూలీకే అధిక అవకాశాలు ఉన్నట్టు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇక కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా నూతన కార్యదర్శిగా, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ చిన్న సోదరుడు అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా ఎన్నికవుతారని సమాచారం.

ఇక కొన్ని వారాల పాటు జరిగిన లాబీయింగ్ అనంతరం గంగూలీని, మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగానే ఎన్నుకోవాలని సభ్యులు నిశ్చయించారు. ఈ మేరకు ఆదివారం నాడు న్యూఢిల్లీలో బీసీసీఐ రాష్ట్ర సంఘాల బాధ్యులు సమావేశమై, కీలక పదవుల్లో ఎవరెవరు ఉండాలన్న విషయమై ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. కాగా, 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ దశలో మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సన్నిహితుడైన బ్రిజేష్ పటేల్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, ఆయనకు మిగతా రాష్ట్రాల నుంచి మద్దతు లభించలేదని సమాచారం. గంగూలీయే స్వయంగా బ్రిజేష్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది.

బ్రిజేష్ ను బీసీసీఐ అధ్యక్షుడిగా చేసి, గంగూలీకి ఐపీఎల్ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పటికీ, దానికి పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులతో పాటు గంగూలీ కూడా అంగీకరించలేదు. దీంతో గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి, బ్రిజేష్ కు ఐపీఎల్ పదవి ఇవ్వాలని బోర్డు నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్న సంగతి నేడు తేలుతుంది. వాస్తవానికి బీసీసీఐ ఎన్నికలు ఈ నెల 23న జరగాల్సివుంది. అయితే, అన్ని కీలక పోస్టులనూ ఏకగ్రీవం చేయాలన్న ఉద్దేశంతో బోర్డు ఉండటంతో, నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజైన నేడే ఏ పదవి ఎవరికి దక్కుతుందన్న విషయం స్పష్టం కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*