రాజు గారి గది-3 మూవీ రివ్యూ

చిత్రం : రాజు గారి గది-3

నటీనటులు: అశ్విన్ బాబు-అవికా గోర్-ఆలీ-ఊర్వశి-ధన్ రాజ్-బ్రహ్మాజీ-ప్రభాస్ శీను-హరితేజ-అజయ్ ఘోష్ తదితరులు

మాటలు: సాయిమాధవ్ బుర్రా

ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు

సంగీతం: షాబిర్

నిర్మాణం: ఓక్ ఎంటర్టైన్మెంట్స్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్

టాలీవుడ్‌లో ఒకప్పుడు హారర్‌ కామెడీలు మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ జానర్‌. కానీ వరుసగా అదే తరహా సినిమాలు రావటంతో ఆడియన్స్‌కు కూడా ఆ జానర్‌ సినిమాలు బోర్‌ కొట్టేశాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఆ టైపు సినిమాలకు దాదాపుగా గుడ్‌బై చెప్పేశారు. తరువాత అడపాదడపా కామెడీ హారర్‌లు వచ్చినా పెద్దగా ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో ఒక్క ఆనందో బ్రహ్మా తప్ప సక్సెస్‌ అయిన కామెడీ హారర్‌ సినిమానే లేదు. ఇలాంటి టైంలో కామెడీ హారర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శక నిర్మాత ఓంకార్‌. రాజుగారి గదితో సూపర్‌ హిట్ అందుకున్న ఓంకార్‌ తరువాత రాజుగారి గది 2తో నిరాశపరిచాడు. అయితే తనకు సక్సెస్‌ ఇచ్చిన అదే సిరీస్‌ను కంటిన్యూ చేస్తూ రాజుగారి గది 3 సినిమాను రూపొందించాడు.

కోలీవుడ్‌లో సక్సెస్‌ అయిన దిల్లుకు దుడ్డు 2 సినిమా లైన్‌ను తీసుకొని తనదైన స్టైల్‌లో ట్రీట్‌మెంట్‌ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు ఓంకార్‌. అంతేకాదు తన తమ్ముళ్లకు సక్సెస్‌ ఇచ్చే వరకు తెల్ల డ్రస్‌ మాత్రమే వస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి ఈ సినిమాతో అశ్విన్‌ బాబును సోలో హీరోగా లాంచ్‌ చేశాడు. మరి ఓంకార్‌ చేసిన ప్రయత్నం ఫలించిందా..? సోలో హీరోగా అశ్విన్‌ బాబు ఆకట్టుకున్నాడా..? తమన్నా చేయాల్సి పాత్రలో అవికా ఎంతవరకు న్యాయం చేసింది..? ఈ విషయాలు రివ్యూలో చూద్దాం.

మాయ (అవికా గోర్) హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్. ఆమె మీద కాంక్షతో ఎవరు దగ్గరికి వెళ్లినా వాళ్లు చిక్కుల్లో పడుతుంటారు. ఓ దయ్యం వాళ్లను ఇబ్బంది పెడుతుంటుంది. మాయ కోసం ఆశపడి దయ్యం బారిన పడ్డ డాక్టర్ శశి (బ్రహ్మాజీ) తమ కాలనీలో అందరికీ తలనొప్పిగా మారిన అశ్విన్ (అశ్విన్ బాబు)ను మాయ వెంట పడేలా చేసి అతణ్ని ఇబ్బందుల్లోకి నెట్టాలనుకుంటాడు. మాయ పట్ల ఆకర్షితుడై ఆమెకు ఐ లవ్యూ చెప్పిన అశ్విన్ కు దయ్యం బాధ తప్పదు. దీనికంతటికీ కారణం మాయ తండ్రి అయిన క్షుద్ర మాంత్రికుడనుకుని అతడి కోసం కేరళకు వెళ్తాడు అశ్విన్. అక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఇంతకీ మాయకు దయ్యానికి సంబంధమేంటి.. ఈ దయ్యం బాధ వదిలించుకుని మాయను అశ్విన్ పెళ్లాడాడా లేదా అన్నది తెరమీదే చూడాలి.

సినిమాను హారర్‌ ఎలిమెంట్‌తో ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టిన దర్శకుడు తరువాత ఆ పాయింట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. తన తమ్ముడిని మాస్‌ హీరోగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో ఓ కమర్షియల్ ఫార్ములా సినిమాలా పాటలు, కామెడీ, ఫైట్లతో సినిమాను నడిపించాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా కాలనీ జనాలను అశ్విన్‌, అతని మామ (అలీ) కలిసి ఇబ్బంది పెట్టడం, హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ స్టోరికి పరిమితం చేసిన దర్శకుడు అసలు కథను మొదలు పెట్టలేదు. కాలనీలో జరిగే కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నా.. అసలు కథ కోసం ఎదురుచూసే ఆడియన్‌కు ఫస్ట్‌ హాఫ్‌ అంతా భారంగా సాగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. దీనికితోడు హారర్‌ కామెడీ అని వచ్చిన వారిని రొటీన్‌ కామెడీ సీన్స్‌ మరింత విసిగిస్తాయి.

ఇంటర్వెల్‌ బ్లాక్‌ సమయానికి కథ కాస్త గాడిలో పడ్డట్టుగా అనిపించినా తరువాత కూడా ఆసక్తికర సన్నివేశాలు లేకపోవటంతో కథనం సాధాసీదాగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ కొద్ది సేపు బాగానే అనిపించినా తరువాత మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎక్కడో దాచిన తాళపత్ర గ్రంథాలు తెస్తేగాని ఆ దెయ్యం మాయను వదలదని బిల్డప్‌ ఇచ్చి, చివరకు దెయ్యాన్ని హీరో చేతిలో మట్టి కరిపించేయటం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు.

సోలో హీరోగా తొలి సినిమానే అయిన అశ్విన్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీతో పాటు లవ్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. కొన్ని బరువైన సన్నివేశాల్లో ఇంకా పరిణతి చూపించాల్సి ఉంది. అవికా తనకు అలవాటైన పాత్రలో ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్‌ అంతా హుందా కనిపించిన ఈ భామ, క్లైమాక్స్‌లో తన లుక్‌, పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. హీరో మామ పాత్రలో అలీ చాలా కాలం తరువాత ఫుల్‌ లెంగ్త్‌ రోల్ చేశాడు. తనదైన మేనరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నాడు. మలయాళ మాంత్రికుడిగా అజయ్‌ ఘోష్‌, రాజమాతగా ఊర్వశీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, శివశంకర్‌ మాస్టర్‌, హరితేజ, ప్రభాస్‌ శ్రీను ఫస్ట్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేశారు.

 ‘రాజు గారి గది-3’లో పాటలకు ఏ ప్రాధాన్యం లేదు. హీరో హీరోయిన్ల మీద తీసిన లవ్ సాంగ్ బోరింగ్. ఐటెం సాంగ్ లోనూ ఏ విశేషం లేదు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం షాబిర్ ప్రతిభ చాటుకున్నాడు. దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. ప్రేక్షకుల్లో భయం పుట్టించింది. ఛోటా కే నాయుడు కెమెరా పనితనం కూడా ఈ సన్నివేశాల్లోనే కనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి సరిపోయేట్లుగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. ఎఫెక్ట్స్ ఓకే. సాయిమాధవ్ బుర్రా సంభాషణల్లో ఆయన ముద్ర కనిపించలేదు. ‘‘నువ్విలా విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటే నాకు విరేచనాలవుతున్నాయి’’.. ‘‘పై నుంచి పడాల్సిన వర్షం నా పంచె లోంచి పడుతోంది’’.. ‘‘మూత్రం వచ్చే సమయంలో మంత్రాలు ఎలా వస్తాయిరా’’.. ఇలా సినిమాకు తగ్గట్లుగా మాటు రాశారాయన. ఇక రచయిత-దర్శకుడు ఓంకార్.. కేవలం మాస్ కామెడీని నమ్ముకుని సినిమాను లాగించేశాడు. కథాకథనాల మీద ఏమాత్రం కసరత్తు చేయలేదు. మరీ నాటుగా సాగిపోయే అతడి కామెడీ ఓ వర్గం ప్రేక్షకుల్ని మ ాత్రం మెప్పిస్తుంది. ఎంత దయ్యం కథ అయినప్పటికీ కాస్తయినా లాజిక్ ఉండాలి.. సీరియస్నెస్ ఉండాలనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. అతడి ‘రాజు గారి గది’ సిరీస్ లో వీకెస్ట్ ఇదే అనడంలో సందేహం లేదు.

రేటింగ్ – 0.75/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*