రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ

ప్రొడక్షన్ : ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా 9
నటీనటులు : కిరణ్ అబ్బవరం, రాస్య గోరఖ్, రాజ్ కుమార్, యజుర్వేద తదితరులు
మ్యూజిక్ : జయ్ క్రిష్
కెమెరా : విద్య సాగర్, అమరదీప్
ఎడిటింగ్ : విప్లవ్
నిర్మాతలు : మనో వికాస్, మనోజ్
డైరెక్టర్ : రవి కిరణ్ కోలా

హిట్ సినిమా అంటే ఏంటి…?
డబ్బులు వచ్చే సినిమానా, లేక విమర్శకుల మెప్పు పొందే సినిమానా, అభిమాన నీరాజనాలు అందుకునే సినిమానా.. ఇలా హిట్ అనే పదానికి మీనింగ్ కోసం మనం ఫిల్మ్ నగర్ మొత్తం టార్చ్ లైట్ పెట్టి వెతికినా సరైన సమాధానం దొరకదు. అలానే హిట్ సినిమాలు తీసే టాలెంట్ ని కూడా వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొందరు కుర్రాళ్ళు కలిసి తీసిన రాజావారు రాణిగారు సినిమా ఈ రోజే రిలీజ్ ఐయింది. మరి ఈ న్యూ టాలెంట్ హిట్ సినిమా తీశారో లేదో ఒకసారి చూద్దాం…

కథ : అదో అందమైన పల్లెటూరు, ఆ ఊరిలో రాజా(హీరోయిన్) అనే కుర్రాడు రాణి(హీరోయిన్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు, కానీ తనలో ఉన్న ప్రేమను రాణి కి మాత్రం చెప్పడు, రాణి కూడా రాజు ని ఇష్టపడుతుంది కానీ బయటపడదు. మరి రాజు రాణి కి తన ప్రేమని చెప్పాడా, వీరి ప్రేమకి ఆ ఊరిలోనే ఉంటున్న నాయుడుకి, చౌదరికి సంబంధం ఏంటి, రాణి ప్రేమ కోసం రాజా ఏం చేశాడు, రాజా మీద తనకున్న ప్రేమని రాణి ఎలా బయటపెట్టిందో.. తెలియాలి అంటే రాజా వారు రాణి గారు చుడాలిసిందే..

విశ్లేషణ : రాజా వారు రాణి కథ పాతదే ఐనా చూసే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎక్కడా అనిపించదు, ఏదో ఓ కొత్త కథ ని చూస్తున్నాము అనే అనిపించేలా ఆడియన్స్ పై తన డైరెక్షన్ స్కిల్స్ తో మాయ చేశాడు డైరెక్టర్ రవి కిరణ్, తొలి సినిమాతోనే దర్సకుడిగా మంచి మార్కులు కిరణ్ సంపాదించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనకు అందుబాటులో ఉన్న వనరులు వాడుకొని రాజా వారు రాణి గారు అనే ఓ అందమైన పల్లెటూరి ప్రేమకథ ని రెడీ చేశాడు కిరణ్. ఐతే కొన్ని సన్నివేశాలు మలయాళం వాసనా కొడతాయి, అలా సినిమా స్లో ఐనా ప్రతి సారి కామెడీ, ఎమోషన్ సన్నివేశాలు తో బాలన్స్ చేశాడు కానీ ఆ చిన్న లాగ్స్ వల్లె సినిమా ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక నటీనటులుంచి కిరణ్ రాబట్టుకున్న నటన, హావభావాలు డైరెక్టర్ గా తన టాలెంట్ ని నిరూపించాయి. ముఖ్యంగా లో బడ్జెట్ లో రవి కిరణ్ ఇంత అందంగా సినిమాను ఎలా రాబట్టాడు అని అనిపించకమానదు, గోదావరి జిల్లాలో ఉన్న ప్రకృతి అందాల్ని వాడుకుని ఓ విజువల్ వండర్ గా రాజు వారు రాణి గారిని తీర్చిదిద్దాడు రవి కిరణ్. ఇక కిరణ్ థాట్స్ కి విజువల్స్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్స్ విద్య సాగర్, అమర్ దీప్ కెమెరా పని తనం కూడా అద్భుతంగా ఉంది. వీరిద్దరి వర్క్ ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేసింది. అలానే జయ క్రిష్ మ్యూజిక్, కొత్త కుర్రాళ్ల ని నమ్మి ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టన నిర్మాతలు మనోజ్, వికాస్… ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు రాజా వారు రాణి గారు ఆడియన్స్ కి కచ్చితంగా గా నచ్చాలి అని పెట్టిన కసి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం కూడా తను పోషించిన రాజు పాత్రకి సంపూర్ణ న్యాయం చేశాడు, మనసులో ప్రేమని బయటపెట్టలేక, అలా అని ప్రేమ ని వదులుకోలేక కిరణ్ పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. అలానే హీరోయిన్ రాస్య గోరఖ్ కూడా తన నటన తో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత బాగా బిజీ అయ్యే అవకాశం ఉన్న నటులు రాజకుమార్, యజుర్వేద.. ఈ సినిమాలో వీరిద్దరూ నటించిన నాయడు, చౌదరి పాత్రలు ఆడియన్స్ కి నూటికి నూరు శాతం నచ్చడం ఖాయం. వీరి పాత్రలు ఎలా ఉన్నాయో చెబితే సస్పెన్స్ పోతుంది కనుకు చెప్పడం లేదు కానీ ఈ పాత్రలు పోషించిన రాజకుమార్, యజుర్వేద మాత్రం తొందర్లోనే బిజీ అవ్వడం మాత్రం ఫిక్స్. ఓవర్ అల్ గా రాజావారు రాణిగారు ఓ అందమైన పల్లెటూరు ప్రేమకథ.

బాటమ్ లైన్ : పచ్చని పల్లెటూరు ప్రేమకథ

Rating: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*