పోలవరం పరుగులు: జగన్ యాక్షన్ ప్లాన్.. మేఘా సంకల్పం

అది చంద్రబాబు ప్రభుత్వం.. విభజనతో కుదేలైన ఏపీని ఆదుకునేందుకు ‘పోలవరం’ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. నిధులు ఇచ్చింది. కానీ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ఒక ఏటీఎంలా మారిందన్న విమర్శలు వచ్చాయి. ఐదేళ్ల పాలనలో పోలవరం అడుగు ముందుకు పడలేదు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో రోజుకు కేవలం సగటున 131.59 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే చేసింది. కానీ నేడు వైసీపీ ప్రభుత్వం-మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కలిసి చేపట్టిన పోలవరం పనులు జెట్ స్పీడుగా సాగుతున్నాయి. ఏకంగా రోజుకు సగటున 3000 క్యూబిక్ మీటర్ల పనులు చేస్తూ మేఘా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తోంది. నాటి చంద్రబాబు పాలనకు.. నేటి జగన్ పాలనకు మధ్యనున్న స్పష్టమైన తేడా ఇదీ.. అంతేకాదు..ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లను జూలై 2021 నాటికి పూర్తి చేస్తామని.. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మేఘా సంకల్పంతో ముందుకు వెళుతోంది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించేందుకు ఏపీ ప్రభుత్వం, మేఘా నడుం బిగించింది.

*జగన్ యాక్షన్ ప్లాన్.. మేఘా సంకల్పం
2021 లోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. స్పిల్ వే, స్పిల్ చానల్, నిర్వాసితులకు పునరావాసం, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులను సమన్వయంతో చేపట్టడం ద్వారా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ ప్రణాళికలను సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండడం వల్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేఘా సంస్థ ప్రతీరోజు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేస్తోంది. ప్రస్తుతం స్పిల్ వేలో వెయ్యి క్యూబిక్ మీటర్లు, స్పిల్ చానెల్ లో రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ప్రతీరోజు చేస్తున్నారు. అంటే రోజుకు 3వేల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తున్నారు. ఈ పనులు మే 2021 నాటికి పూర్తవుతాయి.

*వలస కార్మికులను తీసుకొచ్చిన మేఘా
కరోనా లాక్ డౌన్ తో బీహార్, ఒడిషాకు చెందిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలిపోవడంతో పోలవరం నిర్మాణ పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వలస కార్మికులకు భరోసా కల్పించి ప్రాజెక్టు పనుల్లోకి తిరిగి రప్పించాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

*మే 2021వరకు 48 గేట్ల బిగింపు
మే 2021 నాటి 48 గేట్లను బిగించి స్పిల్ వేను పూర్తి చేయనున్నట్టు మేఘా సంస్థ తెలిపింది. ప్రస్తుతం వరదలు తగ్గగానే నవంబర్ లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లో ఖాళీని భర్తీ చేసి నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి గోదావరి డెల్టాల పంటలకు ఇబ్బంది లేకుండా చేయాలని వడివడిగా పనులు చేస్తోంది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లను జూలై 2021 నాటికి పూర్తి చేస్తామని.. ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ప్రారంభించి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

*గోదావరికి వరద వచ్చినా బేఫికర్
గోదావరి నదికి ఈ వానాకాలంలో వరద వచ్చినా పనులు ఆగకుండా మేఘా పనులు చేస్తోంది. గోదావరికి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే స్పిల్ వే, స్పిల్ చానెల్ కు వరద జలాలు చేరుతాయి. జూలై ఆఖరుకు ఆ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. స్పిల్ వే పియర్స్ 52 మీటర్లకు పూర్తి చేసి వాటికి గడ్డర్లు బిగించి బ్రిడ్జి స్లాబ్ వేసే పనులు చేపట్టి నవంబర్ వరకు పూర్తి చేస్తామని మేఘా చెబుతోంది. నవంబర్ లో డెల్టాకు అవసరమైన నీటిని స్పిల్ వే మీదుగా మళ్లించి కాఫర్ డ్యామ్ లను పూర్తి చేస్తారు. అప్పటి వరకు పనులు చేసేలా మేఘా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.

*ప్రపంచంలోనే ‘పోలవరం’ నంబర్ 1
ప్రపంచంలోనే గరిష్టంగా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలను తట్టుకునే అతిపెద్ద డ్యామ్ చైనా నిర్మించిన ‘త్రీగోర్జెస్’. కానీ ఇప్పుడు మేఘా సంస్థ ఏకంగా చైనాను దాటేసి అంతకుమించి 50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేను నిర్మించి ఔరా అనిపించింది . ప్రపంచంలోనే ఇసుక తిన్నెలపై అతి పొడవైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను కట్టి ప్రపంచంలోనే ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది.. పోలవరం పూర్తయితే మొత్తం 38.70 లక్షల ఎకరాలకు ఏపీ మొత్తం నీరందుతుంది. ప్రపంచంలోనే గరిష్టంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగా పోలవరాన్ని తీర్చిదిద్దుతూ మేఘా ఒక రికార్డును సృష్టిస్తోంది.

*2021 డిసెంబర్ కు పోలవరం పూర్తి
మేఘా సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంకల్పించాయి. ఈ మేరకు పనులను సీఎం జగన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మేఘా సంస్థతో కలిసి వేగంగా పనులు చేస్తున్నారు. టార్గెట్ వరకు పూర్తి చేస్తామని మేఘా సంస్థ చెబుతోంది. 2022 జూన్ నాటికి ఆయకట్టుకు నీళ్లందించాలని సీఎం జగన్ సంకల్పించారు. ఆ దిశగా మేఘా సంస్థ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*