ముందు చూపుతో ముఖ్యమంత్రి జగన్- అరుదైన ప్రాజెక్ట్ కు ప్లాన్

రతనాల సీమగా పేరున్న రాయలసీమ ఇన్నాళ్లూ పేరులోనే పౌరుషాన్ని నింపుకుంది. ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత విడిపోయాక కూడా ఎక్కువ కాలం పాలన ఉన్నది రాయలసీమ నేతల చేతుల్లోనే. కానీ రాయలసీమ నాలుగు జిల్లాలకు దక్కింది శూన్యం. ఒక్క రాజశేఖర రెడ్డి మినహా అంతకు ముందు ఆ తర్వాత కూడా రాయలసీమకు ఆశాదీపమే కరువైంది. మళ్లీ ఇన్నాళ్లకు సీమ జిల్లాల వాసుల్లో కొత్త ఆశలు రేగుతున్నాయి. ఏడాది దాటిన జగన్ పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ వాసులు, ముఖ్యంగా సీమ జిల్లాల ప్రజలు మాటల ప్రభుత్వం పోయి, చేతల సర్కారు వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు.
రాయల సీమ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కరువే. చెంతనే కష్ణమ్మ ఉన్నా దశాబ్దాలుగా తాగు, సాగు నీటికి సమస్యే. సీమ అభివృద్దిపై మాటలు కోటలు దాటించిన నాయకులు చేతలను మాత్రం కర్నూలు కొండారెడ్డి బురుజు కూడా దాటించలేకపోయారు. ఊదరగొట్టే ఉపన్యాసాలు, గ్రాఫిక్స్ మాయాజాలం చూసిన ప్రజలు తమపై తామే జాలిపడే పరిస్థితి వచ్చింది.

కానీ ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. డా.ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతో పాటు హంద్రీ – నీవా, గాలేరు నగర లాంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి రాయలసీమ రూపురేఖలు మార్చేందుకు తోడ్పడే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను అధిగమిస్తూ, సాంకేతిక సమస్యలను దాటుకుంటూ ప్రాజెక్ట్ పనులకు టెండర్లు పిలిచే దశకు చేరుకుంది.

పాదయాత్రలోనే ప్లాన్ – ముందుచూపుతోనే ప్రాజెక్ట్
సీమ ఇన్నేళ్ల కష్టాలు ఒక్క సారే తీరవు. అదే సమయంలో చిన్నా చితకా ప్రాజెక్టులతో తాగు, సాగు నీటి కష్టాలు గట్టెక్కవు. అందుకే ఆలోచన వచ్చిందే తడవుగా భారీ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. సవాళ్లు, సమస్యలపై నిపుణులతో చర్చించిన జగన్ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సిద్దమయ్యారు. తెలంగాణలో కాళేశ్వరం తరహాలో రాయల సీమ ఎత్తిపోతల పథకాన్ని కర్నూలు జిల్లా సంగమేశ్వరం దగ్గర ప్రారంభించాలని నిర్ణయించారు.

రోజుకు కనీసం మూడు టీఎంసీల పంపింగ్ సామర్థ్యంతో భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. ఇది ఆషా మాషీ వ్యవహారం కాదు. ఉదాహారణకు ఏపిలో అతిపెద్దదిగా భావించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం మొత్తం ఏడాది పంపింగ్ సామర్థ్యం 40 టిఎంసీలు మాత్రమే. అదే విధంగా పట్టిసీమ, ముచ్చుమర్రి, కొండవీటి వాగు, పురుషోత్తపట్నం లాంటి ఎత్తిపోతల పథకాలు గతంలోనే పూర్తయ్యాయి. వీటితో ఏమాత్రం పోలికలేని విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని సంకల్పించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆలోచన వచ్చిందే తడవుగా శాస్ర్త- సాంకేతిక సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయించాక పని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే రాయలసీమలో అత్యధిక ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించడమే కాకుండా, శతాబ్దాలుగా కరువువాత పడుతున్న వారిని శాశ్వతంగా ఆదుకునేందుకు సాధ్యమవుతుంది.

కృష్ణా నదిలో నీళ్లు- సీమలో కరువు కన్నీళ్లు
సీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కానీ స్పష్టమైన కార్యాచరణకు రూపకల్పన జరగలేదు. సువిశాలమైన రాయలసీమలో ఓ వైపున కృష్ణా నది మరోవైపున తుంగభద్రతో పాటు వాటికి ఆనుకుని కర్నాటక నుంచి నెల్లూరు వరకు సీమ మీదుగా పెన్నా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఎప్పుడూ తాగు, సాగు నీటికి కటకటే. స్వాతంత్ర్యం రాక ముందు నిర్మించిన కెసి కాలువు ద్వారా నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ఆయకట్టు కుదించుకుపోయింది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువల ద్వారా కేటాయించిన నీటిలో సగం వాటా కూడా అందని పరిస్థితుల్లో తుంగభద్ర పొంగి ప్రవహించినప్పటికీ ఆయకట్టుకు సరిగ్గా నీరు అందదు. శ్రీశైలం నుంచి 1990 దశకంలో ఎస్.ఆర్.బి.సి, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు చేపట్టారు. ఆ తర్వాత హంద్రీ-నీవా, ముచ్చుమర్రి లతో పాటు శ్రీశైలం నీరు కెసి కాలువకు అందించడం లాంటి పథకాలు పూర్తయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ కింద పిఎబిఆర్ తో పాటు చిత్రావతి లాంటి జలాశయాలు పూర్తయినప్పటికీ రాయలసీమ దశ-దిశలో ఏమాత్రం మార్పు రాలేదు. కరువు తాండవిస్తూనే ఉంది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి వినియోగం పెంచేందుకు వైయస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పటికీ ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంది.

వరదొస్తే నీళ్లు సముద్రం పాలు – సీమ రైతు కంట కన్నీరు
కృష్ణా నదిలో శ్రీశైలం నుంచి రాయలసీమ వాటా 114 టీఎంసీలు
అడపా దడపా మినహా సీమకు నీటి విడుదల అంతంత మాత్రమే
శ్రీశైలం నుంచి రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి. ఇందుకోసం శ్రీశైలం జలాశయం వెనుకబాగంలో అప్రోచ్ కాలువను నిర్మించి అక్కడి నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరి ద్వారా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్ఆర్ఎంసి) ద్వారా జలాశయంలో 841 అడుగుల పైన నీరు చేరిన తరువాత విడుదల చేయాలి. ఎస్ఆర్ఎంసి నుంచి నీరు బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా తెలుగు గంగ (ఎడమవైపు), కెసి కాలువ (మధ్యలో), ఎస్ఆర్బిసి (కుడివైపు)కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఇందుకోసం రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1246 క్యుమెక్స్ లేదా 44 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసే విధంగా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. అంతకు ముందుతో పోలిస్తే దీని సామర్థ్యం పెంచిన తరువాత సీమలో శ్రీశైలం వరద జలాల వినియోగం గణనీయంగా పెరిగింది. అందుకు గత సంవత్సరం 179.30 టిఎంసిల నీటిని రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై నగరాలకు మళ్లించారు. అయినప్పటికీ సీమలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు వరదల సమయంలో నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది.

శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏ ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు. 2004-05 నుంచి 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లం అవుతోంది.
2004-05లో మొత్తం 56.51 టిఎంసిలు వినియోగించారు. 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009-10లో 60.14 టిఎంసిలు (ఈ సంవత్సరం కృష్ణాకు చారిత్రాత్మక స్థాయిలో భారీ వరద వచ్చింది) మాత్రమే వినియోగించారు. 2012-13లో అతి తక్కువగా 22.49 టిఎంసిలు, 2014-15లో 59.17 నీటిని ఉపయోగించారు. 2015-16లో అతి తక్కువగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ళు గత ఏడాది వరకు 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి.

సీమకు ప్రయోజనం లేని కృష్ణా వరదలు
కిందకు పోయే నీటిని చూస్తూ దిగాలుపడ్డ రైతన్న
మొత్తం 16 ఏళ్ళ పాటు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 2018-19, 2019-20 సంవత్సరాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సంవత్సరాలు లభించాల్సిన నీటి కన్నా తక్కువ నీరు అందింది. ఆఖరికి కృష్ణాకు భారీ వరదలు వచ్చి శ్రీశైలం పొంగిప్రవహించి జలాలు సముద్రంపాలు అయినప్పటికీ రాయలసీమ వాసులకు మాత్రం ప్రయోజనం లేకపోయింది. 2019-20 సంవత్సరంలో శ్రీశైలంకు 6 విడతల్లో (స్పెల్స్) వరదలు వచ్చాయి. 889 టిఎంసిల నీటిని స్పిల్ వే నుంచి కిందకు విడుదల చేశారు. అందులో 600 టిఎంసిల నీరు నిరుపయోగంగా సముద్రంపాలు అయ్యింది. అదే సమయంలో రాయలసీమలోని 4 జిల్లాలకు అవసరమైన నీరు అందలేదు. 120 టిఎంసిల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఈ నాలుగు జిల్లాలోనూ ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఇందుకు ప్రధానం కారణం పోతిరెడ్డిపాడు సామర్థ్యం అవసరమైనంత స్థాయిలో లేకపోవడమే. శ్రీశైలం నుంచి 7000 క్యూసెక్కుల నీటిని జలాశయంలో నీటి మట్టం 854 అడుగుల దాటిన తరువాత వినియోగించాలి. అదే విధంగా నీటి మట్టం 881 అడుగులు మించిన తరువాత 44 వేల క్యూసెక్కుల ప్రవహాన్ని పోతిరెడ్డిపాడులోకి అనుమతించాలి. దీనివల్ల సరైన నీటిని సకాలంలో వినియోగించుకోవడం సాధ్యం కావడం లేదు. సంవత్సరం మొత్తానికి 15 నుంచి 20 రోజులు మాత్రమే వరద నీటిని వినియోగించుకోవడం వీలవుతోంది. ఫలితంగా వరద నీరు సైతం సీమ జిల్లాలకు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు జలాశయంలో పూడిక పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోయింది. వాస్తవానికి 308 టిఎంసిల జలాలు ప్రాజెక్ట్ నిండినప్పుడు ఉండాలి. కానీ 215 టిఎంసిలు మాత్రమే ఉంటోంది. అంటే దాదాపు 93 టిఎంసిల నీరు నిల్వ లేకుండ నిరుపయోగం అవుతోంది. ఈ పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ వరద నీటిని మళ్లించుకోవడమే ఏకైక పరిష్కారం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావించారు. దాంతో ఇంజనీరింగ్ నిపుణులు అధ్యయనం చేసి ఆచరణలో సాధ్యమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

397 మెగావాట్ల భారీ పంపింగ్ కేంద్రం
సంగమేశ్వరం సాక్షిగా రాయలసీమకు న్యాయం
రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐపి – రాయలసీమ లిప్ట్ స్కీమ్) ద్వారా రోజు 3 టిఎంసిల (34722 క్యూసెక్కులు) నీటిని వరదల సమయంలో కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లిస్తారు. ఉపనది తుంగభద్ర వచ్చి క్రిష్ణాలో కలిసే సంగమేశ్వరం ప్రాంతం వద్ద ఈ పథకాన్ని చేపడతారు. ఇక్కడ మూడు టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా పంపింగ్ కేంద్రాన్ని నిర్మిస్తారు. జలాశయంలో 800 నుంచి 850 అడుగుల వరకు నీరు ఉన్నప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా అవసరాలకు మళ్లించే విధంగా నీటిని పంప్ చేసి పోతిరెడ్డిపాడు సమీపంలోని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ఆర్ఎంసీలోకి విడుదల చేస్తారు. కృష్ణా నదికి గరిష్టంగా వరదలు ఉన్నపుడు రోజుకు 8 టిఎంసీల వరకు కూడా పంప్ చేసేందుకు ఉపయోగపడే విధంగా నిర్మించి సీమ అవసరాలు తీర్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

పంప్ చేసిన నీటిని 125 మీటర్ల పొడవున ఏర్పాటు చేసే పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తారు. ఆ తరువాత డెలివరీ సిస్ర్టన్ నుంచి నీరు విడుదలై 22 కిలోమీటర్ల మేర ప్రవహించి పోతిరెడ్డిపాడుకు సమీపంలో 4-5 కిలోమీటర్ల మద్య ఎస్ఆర్ఎంసిలో కలుస్తుంది. అక్కడి నుంచి నీరు తెలుగు గంగ, ఎస్.ఆర్.బి.సి, కెసి కాలువలకు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో పంప్ హౌస్ తో పాటు సంగమేశ్వర నుంచి ముచ్చుమర్రి వరకు 4.5 కిలోమీటర్ల కాలువ శ్రీశైలం వెనుక జలాల భాగంలో తవ్వుతారు. పంప్ హౌస్ లో 12 మిషన్లు ఏర్పాటు అవుతాయి. ఒక్కొక్కటి 81.93 క్యుమెక్కుల సామర్థ్యంతో 39.60 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసే విధంగా 33.04 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్ లు, మోటార్లు ఏర్పాటు అవుతాయి.
మొత్తం 397 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవసరమవుతుంది. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించి ఒక కేంద్రం నుంచి నీటిని పంపింగ్ చేయడం రాష్ర్టంలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఏపిలో ఇదే అరుదైనది, పెద్దది అవుతుంది.

ఈ పంప్ హౌస్ పనిచేయాలంటే కనీస నీటిమట్టం 243 ఉండాలి. డెలివరీ లెవల్ 273 వద్ద ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముఖ్యంగా కొత్తకాలువ తవ్వడానికి 12 వేల ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు.
మొత్తం మీద సంకల్పం, పట్టుదల దశాబ్దాల నిర్లక్ష్యానికి చమరగీతం పాడబోతుంది
సీమ రైతుల కన్నీటి కష్టాలకు రాయలసీమ ఎత్తిపోతల పథకం శాశ్వత పరిష్కారం కాబోతోంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*