ప్రకృతి కరుణించి మంచి వర్షాలు, అయినా కృష్ణా జలాలు నిరుపయోగం

మరో సారి ప్రకృతి కరుణించింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు అన్నీ నిండుతున్నాయి. అయితే ఈ నీళ్లన్నీ మళ్లీ సముద్రం పాలేనా, వందల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలవాల్సిందేనా. పైన కర్ణాటక ఎంతగా బంధించినా వరుణుడి దయతో మరోసారి జలసిరి ఆంధ్రా, తెలంగాణకు పరుగులు పెడుతోంది. కానీ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు మాత్రం రాజకీయ వివాదాల్లో చిక్కుకుని ముందుకు పడలేని పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దన్నల్లా సమస్యను పరిష్కరించాల్సిన బీజేపీ ఇద్దరు సీ.ఎంల మధ్య తగవుకు, తద్వారా రాజకీయ లబ్దికి పావులు కదుపుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. హడావిడిగా ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు వెనుక కేంద్రం ఔచిత్యాన్ని అందరూ ప్రశ్నించే పరిస్థితి. కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా సోకడంతో ఈ నెల 25 న జరగాల్సిన సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్లు సమాచారం. వాస్తవానికి అంతరాష్ట్ర వివాదాలు ముఖ్యంగా నీటి పంపకాలకుసంబంధించి ఇప్పటివి కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జలాలకు సంబంధించి లభ్యత తక్కువగా ఉండి వినియోగం పెరుగుతుండడంతో గత నాలుగు దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలు తీవ్రమయ్యాయి. నీటి పంపకానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ సమయంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర – తెలంగాణ విడిపోయాయి. బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కనుచూపు మేరలో రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ఊసే కనిపించటం లేదు. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాయలసీమ ప్రాజెక్టు సాకుగా పావులు కదిపేందుకు రంగంలోకి దిగిందన్న వాదనలు బలపడుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టు పాతదే అన్న ఎన్జీటీ తీర్పును కూడా తిరగదోడేందుకు బీజీపీ ప్రయత్నిస్తున్నదట.

సాగునీటి రంగానికి తెలుగు రాష్ర్టాల ప్రాధాన్యతే కన్నుకుట్టిందా?
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అందులో భాగంగా కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్ట్ లు గోదావరిపై నిర్మిస్తున్నాయి. ఇక కృష్ణాలో నీటి లభ్యత ఆధారంగా తెలంగాణలో పాలమూరు- రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం, ఎస్ఎల్ బీసీ లాంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్ట్లు చివరిదశ నిర్మాణంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఈ ప్రాజెక్టులు పూర్తయితే నీటి సమస్య అనేదే ఉండకపోవచ్చు. కృష్ణా జలాల సద్వినియోగం కూడా జరుగుతుంది. వరదలు వచ్చినపుడు వృధా అవుతున్న సుమారు 600 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కృష్ణాకు వరద రాకపోయినా, పోలవరం పూర్తియిన తర్వాత గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లింపు చేసుకునే అవకాశం ఉంటుంది. అటు రాయలసీమకు, ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు న్యాయం జరగాలంటే ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, తెలంగాణలో పాలమూరుతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలి. రెండు రాష్ట్రాలు సమస్వయంతో ఈ నీటి కేటాయింపులను పరిష్కరించుకుని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి.

తెలంగాణలో కృష్ణా ఆధారిత ప్రాజెక్ట్ లపై నిర్లక్ష్యం తెలంగాణలోని కృష్ణా ఆధారిత సాగునీటి పథకాలు నత్తనడకన నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ను మూడేళ్ళలో పూర్తిచేసి తెలంగాణ ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు. ఊహించని విధంగా ఎక్కడో ఉన్న గోదావరి నీటిని పంపింగ్ ద్వారా హైదరాబాద్ దాకా తీసుకురావటం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు సీఎం శ్రధ్ద చూపటంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే ప్రతిపక్షాలకు అందివచ్చిన అవకాశంగా మారింది. రాయలసీమ ప్రాజెక్టును బూచిగా చూపి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. రాజకీయ ఎదుగుదల కోసం చూస్తున్న బీజీపీకి కూడా ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అందివచ్చిన అవకాశంగా మారిందనే చర్చ జరుగుతోంది.

పోతిరెడ్డిపాడు ఎత్తు సమస్య- నీటిని వాడుకోలేకపోతున్న ఏపీ శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని వినియోగించాల్సి ఉండగా గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన ఏఒక్క ఏడాది కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు మళ్లించలేకపోయారు. రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు-ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవాలి. 2004-5 నుంచి 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లం అవుతోంది. 2004-05లో మొత్తం 56.51 టిఎంసిలు వినియోగించారు. 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009- 10 లో భారీ వరద రావటంతో 60.14 టీఎంసీలు మాత్రమే ఉపయోగించారు. 2012-13లో అతి తక్కువగా 22.49 టిఎంసిలు, 2014-15లో 59.17 నీటిని ఉపయోగించారు. 2015-16లో అతి తక్కువగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ళు గత ఏడాది వరకు 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి.

రాయలసీమ పాత ప్రాజెక్టే-ఆధారాలతో సహా ఏపీ రెడీ ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పైన చెప్పిన ప్రాజెక్టులకు నీటి సౌకర్యాన్ని సమర్థవంతంగా కల్పించేందుకు మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఉపయోగపడుతుంది. అందుకోసం సంఘమేశ్వర వద్ద పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ ఆర్ ఎం సి లోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. కేటాయించిన నీటిని మాత్రమే ఉపయోగించుకునేలా ప్రాజెక్టు డిజైన్ ఉంటుంది.

నీటి వివాదాలతో నిప్పు రాజేస్తూ రాజకీయ స్వార్థంతో పార్టీలు?

రాయలసీమ ప్రాజెక్టు ఉద్దేశ్యం మంచిదైనా దానిని చెప్పుకోవటంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతిపక్షాలు మాత్రం తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి కాబట్టి మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. అదే సమయంలో దక్షిణ తెలంగాణకు నష్టమనే వాదనకు సమర్థవంతంగా వివరణ ఇవ్వలేకపోయింది ఏపీ ప్రభుత్వం. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై భారం పడింది. ఇదే అదనుగా బీజీపీ రంగంలోకి దిగింది. కేసీయార్ ను ఇరుకున పెట్టడం ద్వారా తెలంగాణలో బలపడవచ్చన్న వ్యూహ్యానికి బీజీపీ పదునుపెడుతోందన్న వాదనలు ఉన్నాయి. కానీ రాయలసీమ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. అపెక్స్ కమిటీ భేటీకి కూడా సమర్థవంతంగా రెడీ అవుతోంది. ఏది ఏమైనా రాజకీయ పార్టీల సుడి గుండాలు, వివాదాలను దాటి కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు సమర్థవంతంగా ఉపయోగపడాలనే అందరూ కోరుకుంటున్నారు. లేదంటే మళ్లీ పాత కథే పునరావృతం అవుతుంది. ప్రాజెక్టులు నిండాయి, గేట్లు తెరుస్తారు. వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. అటు రాయలసీమ రైతులు, ఇటు దక్షిణ తెలంగాణ రైతులు కూడా మళ్లీ మబ్బుల వర్షంపైనో, మెట్ట పంటలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్రం ఏదైనా సరే దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాలను తాగు, సాగు నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మానవతా దృక్పథంలో సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది అని సాగునీటి రంగం నిపుణులు, రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*